న్యూ ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి మర్లేనా ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం విషయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సిఎం పదవికి రాజీనామా చేయడం, అతిషిని కొత్తగా సిఎంగా ఎన్నుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేబినెట్లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కేబినెట్లో పాత మంత్రులతో పాటు మరో కొత్త ముఖాలకు సైతం ఛాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలు సమతూకంపై పార్టీ కసరత్తు చేస్తున్నది. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒకరికి మరొకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చేందుకు సిఎం సానుకూలంగా లేరనే సమచారంతో ప్రస్తుత మంత్రులకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. కేబినెట్ బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్, సంజీవ్ ఝా, దిలీప్ పాండే, మహేంద్ర గోయల్ జనరల్ కేటగిరిలో పోటీలో ఉన్నారు.