అశ్విన్ సరికొత్త రికార్డు

  • In Sports
  • November 14, 2019
  • 53 Views
అశ్విన్ సరికొత్త రికార్డు

ఇండోర్ : టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో స్వదేశంలో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ మొమినల్ హక్ (37)ను బౌల్డ్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. స్వదేశంలో అశ్విన్‌కు ఇది 42వ టెస్టు. అనిల్ కుంబ్లే 43 టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ అతడి కంటే ఓ టెస్టు ముందుగానే ఈ ఘనత సాధించాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా 42 టెస్టుల్లోనే 250 వికెట్లు సాధించాడు. స్వదేశంలో టెస్టుల్లో 250 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కూడా అశ్విన్ రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు కుంబ్లే, హర్భజన్ సింగ్ ఈ ఘనత సాధించారు.
పటిష్ట స్థితిలో భారత్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 37, చతేశ్వర్ పుజారా 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. 150 పరుగులకే ఆలౌట్ అయింది. మహ్మద్ షమీ, రవి చంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్‌లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను దెబ్బమీద దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రహీం చేసిన 43 పరుగులే అత్యధికం. షమీ మూడు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు

తాజా సమాచారం