విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత, గుంటూరులో వందల మంది అరెస్ట్

విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత, గుంటూరులో వందల మంది అరెస్ట్

అమరావతి: సైన్యంలో తాత్కాలిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సాగుతున్న ఆందోళనల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ కనిపిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రంగంలో దింపారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసారు. రైల్వే స్టేషన్ల వద్ద పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన స్టేషన్లలోనూ తనిఖీలు చేసి టికెట్లు ఉన్న ప్రయాణిలకును మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విశాఖ, గుంటూరు నగరాల్లో శనివారం నిరసనలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో రెండు కేంద్రాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ని ఉదయం నుంచి మూసివేశారు. ప్రయాణికుల రాకపోకలు కూడా నిలిపి వేశారు. రైళ్లను దువ్వాడ మీదుగా మళ్లించారు. గుంటూరులో కూడా రైల్వే స్టేషన్తో పాటు బస్ స్టాండ్, ఇతర ప్రధాన కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. అయినప్పటికీ కొందరు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. గుంటూరు సహా పలు కేంద్రాల్లో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంక్షలు ఉల్లంఘించి ఆందోళనకు పూనుకునేందుకు యత్నించిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ ఎస్సీ ఆరిఫ్ ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం, విజయవాడ రైల్వే స్టేషన్ పలు కార్యాలయాల వద్ద పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. సీఎంవోకి వెళ్లే మార్గంలో అనుమానితులను పోలీసులు ప్రశ్నించి, ఆధారాలు చూపించిన తర్వాత అనుమతిస్తున్నారు. జాతీయ రహదారిపై కూడా పలు చోట్ల పోలీసు పహారా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ అదనపు బలగాలను రంగంలో దింపినట్టు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనల నేపథ్యంలో అటు రైల్వే పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో పాటుగా ఏపీ పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos