బెంగళూరు:నగరంలోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ- తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో వచ్చే శనివారం ఇక్కడి శ్రీకృష్ణదేవరాయ కళా మందిరంలో విఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంత్యుత్సవాన్ని నిర్వహించనున్నారు. సమితి అధ్యక్షుడు రాధాకృష్ణరాజు మంగళవారం ఇక్కడ సమితి పదాధికార్లు గంగరాజు. లక్ష్మిరెడ్డి, ఆదికేశవులు నాయుడు, వరదరాజులు, కృష్ణయ్య నాయుడుతో కలసి విలేఖరులతో మాట్లాడారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, విశిష్ట అతిధిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ యాదవ్, పాల్గొననున్నారు.రవాణా మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్న ఈ వేడుకలో సినీ నటులు జయసుధ, సుమన్‌కు డాక్టర్ అక్కినేని శత జయంతి పురస్కారాల్ని ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా నవీన్, ధనలక్ష్మి బృందం అక్కినేని చలన చిత్రాల గీతాల్ని ఆలాపిస్తారు.
తెలుగు, కన్నడ కవులు చిత్రాల ఆవిష్కరణ:
తెలుగు కవులు నన్నయ, తిక్కన, పాల్కురికి సోమ నాథుడు, ఎర్రా ప్రగడ, శ్రీనాధుడు,త్యాగరాజు, తాళ్లపాక అన్నమాచార్య, అల్లసాని పెద్దన, విశ్వనాథ సత్యనారాయణ, కన్నడ కవులు పంప, పొన్న, రన్న, హరిహర, కుమార వ్యాస, సర్వజ్ఞ, పురందరదాసు, కువెంపు. పన్నెండో శతాబ్ధపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి తైల వర్ణ చిత్రాల్ని కూడా ఈ సందర్భంగా శివకుమార్ ఆవిష్కరిస్తారని రాధాకృష్ణ రాజు వివరించారు. ప్రముఖ చిత్రకారుడు మురళి తైలవర్ణ చిత్రాలకు కుంచెతో ప్రాణం పోశారు.