అందాల లోకం అంకోలా..

  • In Tourism
  • February 22, 2020
  • 312 Views
అందాల లోకం అంకోలా..

కర్ణాటక ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో ఆధ్యాత్మిక భావనలు,పచ్చటి పర్యాటక ప్రాంతాలు,కాఫీ తోటలు,సుగంధ ద్రవ్యాల పరిమళాల గుబాళింపుతో మనసు ఒకరకమైన ఊహాలోకంలోకి వెళ్లిపోతుంది.ఎంత చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ప్రకృతి అందాలు,సోయగాలతో మంత్రముగ్ధుల్ని చేసే మలెనాడు,కరావళి ప్రాంతాల్లోని జిల్లాల్లో ఒకటైన ఉత్తరకన్నడ జిల్లా అటువంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలతో అలరారుతోంది. జిల్లాలోని ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అంకోలా.సముద్రతీరాలు,పచ్చనైన తోటలతో అంకోలాకు పర్యాటకంగానే కాకుండా చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.కరావళి ప్రాంత సాంస్కృతిక కళలకు,సంప్రదాయాలకు సైతం ఈ ప్రాంతం ఇప్పటికీ కేంద్రంగా భాసిల్లుతోంది.

అంకోలా పట్టణం..

సముద్ర తీరప్రాంతం కొండవైపు పెరిగిన అంకోలా అనే దట్టమైన పేరు మీదుగా ఈ ప్రాంతానికి అంకోలాగా నామకరణం చేశారు.ఒకవైపు సముద్రతీరం,మరోవైపు దట్టమైన అడవులు,ఎటు చూసినా పురాతన ఆలయాలు,పాఠశాలలు,పచ్చటి పొలాలు, కొబ్బరితోటలు, మామిడి, జీడిపప్పు తోటలతో నయన మనోహరంగా దర్శనమిస్తుంది.గంగావలి ఇక్కడి తాగు,సాగు నీటి అవసరాలు తీరుస్తుంటుంది.ఇక అంకోలా పట్టణంతో పాటు చుట్టుపక్కల ఎన్నో దర్శనీయ పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి.వాటిలో మహామాయ ఆలయం,ఆర్యదుర్గ ఆలయం,విభూతి జలపాతం,హనీబీచ్‌,నదీబాగ్‌ బీచ్‌ ముఖ్యంగా  చూడాల్సిన ప్రదేశాలు.

వేటకు చిక్కన చేపలు..

మహామాయ ఆలయం..
అంకోలా పట్టణంలోని అతి ముఖ్యమైన ఆలయాల్లో లక్ష్మీ నారాయణ మహామాయ ఆలయం ప్రధానమైనది.1510వ సంవత్సరంలో గోవా నుంచి పారిపోయిన జీఎస్బీ బ్రాహ్మణులు తమ కులదేవతలతో సహా అంకోలాకు ఇచ్చి స్థిరపడ్డారు.పోర్చుగీసు పాలనలో మతపరమైన హింస,హిందు ఆలయాలు, హిందువులపై వేధింపులు,దాడులు తాళలేక ఇక్కడికి వచ్చిన హిందు కుటుంబాల్లో జీఎస్బీ బ్రాహ్మణులు కూడా ఒకరు.మహామాయ ఆలయం వెనుక పురాణ ఇతిహాస గాథలు కూడా ఉన్నాయని స్థానిక చరిత్ర.ఇక ఇక్కడి ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని 15 ఏళ్లకు ఒకసారి మాత్రమే వెలుపలికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తుంటారు..

మహామాయ ఆలయం..

ఆర్యదుర్గ ఆలయం..

అంకోలా పట్టణంలోని మరో ప్రధాన ఆలయం ఆర్యదుర్గ ఆలయం.సుమారు 300 ఏళ్ల క్రితం ఓ సాధువు నిర్మించిన ఆలయం ఎన్నో విశేషాలను కలిగిఉంది.శిథిలావస్థకు చేరుకున్న ఆర్యదుర్గ ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు.అంకోలా పర్యటనకు వచ్చే పర్యాటకులు,భక్తులు ఆర్యదుర్గ ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకుంటారు.ఆలయాన్ని నిర్మించిన సాధువును ఆలయం ఎదుట సమాధి చేశారు..

విభూతి జలపాతం..
ఇక్కడి సమీపంలోని దట్టమైన పశ్చిమ కనుమల అడవుల్లో ఉన్న విభూతి జలపాతం తప్పకుండా తిలకించాల్సిన పర్యాటక ప్రదేశం.పశ్చిమ కనుమలలోని అనేక జలపాతాలలో విభూతి జలపాతం ఒకటి. చుట్టూ పెద్ద రాళ్ళు మరియు సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి, ఈ జలపాతం ఒక సుందరమైన ప్రదేశం. వేడి దశలకు నీరు అనువైన ఆశ్రయం. స్థానిక పురాణాల ప్రకారం భస్మాసురుడి దహనంతో వెలువడ్డ బూడిద కొట్టుకుపోయినప్పుడు జలపాతం ఏర్పడిందని స్థానిక చరిత్ర.అదే పేరుతో ఒక గ్రామానికి సమీపంలో ఉన్నందున  జలపాతాన్ని మాబ్గి జలపాతం అని కూడా పిలుస్తారు.ఎటు చూసినా పచ్చదనంతో ఉన్న పశ్చిమ కనుమల అడవుల్లో ట్రెక్కింగ్‌ చేసి జలపాతంలో స్నానం చేయడం అదో అద్భుత అనుభవం..

విభూతి జలపాతం..

హనీబీచ్‌..
ఒకవైపు ఎత్తైన కొండలు,మరోవైపు అరేబియా సముద్ర తీరంతో జనసందోహం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది.ప్రేమికులు లేదా ఒంటరి ప్రయాణాలు ఇష్టపడే పర్యాటకులకు హనీబీచ్‌ చక్కటి ప్రదేశం.సముద్ర తీరంలో నడుస్తూ అలసిపోతే సేదతీరడానికి అక్కడక్కడా సహజంగా వెలసిన అందమైన రాళ్ల సమూహం,అంతకుమించిన సూర్యాస్తమయం హనీబీచ్‌ను ప్రత్యేకంగా ఉంచుతోంది..

హనీబీచ్‌..

నదీబాగ్‌ బీచ్‌..
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ గర్జించే అలలతో,చల్లని గాలులతో తూర్పున ఉదయించే సూర్యకిరణాల మధ్యలో ఎంతో అందంగా కనిపించే నదీబాగ్‌ బీచ్‌ తప్పకుండా చూడాల్సిన బీచ్‌లలో ఒకటి.ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు అలసట వస్తే సేద తీరడానికి,కనుచూపు మేర సముద్రాన్ని తిలకించడానికి వీలుగా ఉండే భారీ రాళ్లతో నదీబాగ్‌ బీచ్‌ పర్యాటక ప్రాంతాల ఎంపికలో మొదటిస్థానంలో ఉంటుంది.వీటితో పాటు బెలేకేరి బీచ్, బెలంబర్ బీచ్, షెడికుల్లి బీచ్, గబిట్కేని బీచ్, హోన్నే గుడి బీచ్ (అంకోలా నుండి 5 కిలోమీటర్లు),కెని బీచ్ తప్పకుండా చూడాల్సిందే.ఒక విధంగా బెలెకేరి బీచ్‌,కెనీ బీచ్‌లు ఇంతకంటే చాలా ప్రసిద్ధి చెందిన సముద్ర తీరాలు..

నదీబాగ్‌ బీచ్‌..

బెళికెరి బీచ్‌..

యక్షగాన నిలయం..
కరావళి ప్రాంత ప్రాచీన సాంస్కృతిక కళ యక్షగానానికి అంకోలా కేంద్రంగా విరాజిల్లుతోంది.సుగ్గి నృత్యకళాకారుల ద్వారా యక్షగానం సాంస్కృతిక కళగా రూపాంతరం చెందింది.వరి పంటల సమయంలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళుతూ వరికోతలు ముగిసిన అనంతరం దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సుగ్గీ నృత్యకళాకారులు సాంప్రదాయ దుస్తులు,కిరీటాలు ధరించి యక్షగానం ప్రదర్శించేవారు.కాలక్రమంలో ఇది ఈ ప్రాంతంలో సాంస్కృతిక కళగా ప్రసిద్ధి చెందింది.స్వాంత్రత్య పోరాటాల సమయంలో ప్రజలను చైతన్య వంతులు చేయడానికి యక్షగాన కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు..

యక్షగానం..

పండుగలు..
మే నెలలో జరిగే బండిహబ్బ స్థానికంగా చాలా పెద్దదైన,అతిముఖ్యమైన పండుగగా భావిస్తారు.తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బండిహబ్బలో చివరిరోజు శాంతదుర్గ ఆలయంలో వార్షికమేళా నిర్వహిస్తారు.కన్నులపండుగగా సాగే ఈ మేళా తిలకించడానికి అంకోలాతో పాటు చుట్టుపక్కల పట్టణాలు,గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.ఇక ఇక్కడి పండుగల్లో మరో పెద్ద పండుగ కార్తీక్‌ పండుగ.నవంబర్‌ నెలలో జరుపుకొన కార్తీక్‌ పండుగలో భాగంగా ఐదు ఆలయాల దేవతల ప్రతిమలను అంకోలా పట్టణం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊరేగించి మరుసటి రోజు ఉదయం అంకోలాకు తిరిగి చేరుస్తారు.కార్తీక్‌ పండుగ సందర్భంగా రాత్రి నుంచి ఉదయం వరకు బాణాసంచా పేలుళ్లు చాలా అద్భుతంగా ఉంటాయి..

బండిహబ్బ..

ఉప్పుసత్యాగ్రహంలో సైతం..
1930 లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహం విజయవంతం అయిన తరువాత, కర్ణాటక సొంతంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్ 13 న, సుమారు 40,000 మంది ప్రజల సమక్షంలో M.P. నాదకర్ణి అంకోలాలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. రేవు హోన్నప్ప నాయక్, హొన్నప్ప మంగేష్కర్ వేలం వేసిన మొదటి ప్యాకెట్ ఉప్పును 30 రూపాయలకు కొనుగోలు చేశారు. వేలం తరువాత స్వామి విద్యానంద సభలో ప్రసంగించారు, ఇందులో కర్నాడ్ సదాశివరావు, శ్రీమతి ఉమాబాయి కుండాపూర్, డాక్టర్ హర్దికర్, టి.ఎస్. నాయకంద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు వెంటనే నాయకులను అరెస్టు చేశారు, కాని సత్యాగ్రహం 45 రోజుల పాటు ఉధృతంగా కొనసాగింది. కర్ణాటకలోని మంగుళూరు, కుండపూర్, ఉడిపి, పుత్తూరు, పాడుబిద్రే, వంటి దాదాపు 30 కేంద్రాల్లో ఉప్పు సత్యాగ్రహాన్ని కొనసాగించారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos