హోసూరు : తమిళనాడు శాసన సభకు 2021లో జరిగే ఎన్నికలలో తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్‌కు డిపాజిట్ కూడా దక్కదని ఎడిఎంకె పార్టీ నాయకుడు, చెన్నసంద్రం సహకార సంఘ అధ్యక్షుడు ప్రభాకర రెడ్డి జోస్యం చెప్పారు. హోసూరు-బాగలూరు రోడ్డులోని గోవిందరాజ్ నగర్‌లో వివిధ పార్టీల కార్యకర్తలు మంగళవారం డిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్ మాట్లాడుతూ మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలలోపు బాలకృష్ణారెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని వై.ప్రకాష్ మాటల తూటాలు పేల్చారు. దీనిపై హోసూరులోని ఎడిఎంకె పార్టీకి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డిపై దోపిడీలు, దొమ్మీల కేసులేమీ లేవని, ఆయన రాజకీయాలలో లేని రోజుల్లోనే బాగలూరు ప్రాంత ప్రజల సమస్యలపై చేపట్టిన పోరాటంలో పాల్గొని కేసులో ఇరుక్కున్నారని ప్రభాకర రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎడిఎంకె నాయకులకు డిపాజిట్లు కూడా దక్కవని వై. ప్రకాష్ ఎగతాళి చేయడం ఎడిఎంకె పార్టీలో దుమారం రేపింది. దీనిపై స్పందించిన ఎడి ఎంకె నాయకులు వచ్చే ఎన్నికల్లో వై. ప్రకాష్ తళి నియోజక వర్గంలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సలహా ఇచ్చారు. బాలకృష్ణారెడ్డి మర్రిచెట్టు ఆకులు రాల్చడానికి చెట్టును ఊపలేదని, కూకటి వేళ్ళతో మర్రిచెట్టును పెకిలించడం ఖాయమని ప్రభాకర రెడ్డి సవాల్ విసిరారు. హోసూరు, సూలగిరి, తళి ప్రాంతాలు ఎడిఎంకె పాలనలో ఎంతో అభివృద్ధి చెందాయని, గత నాలుగేళ్లుగా వై. ప్రకాష్ తన నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో వివరిస్తూ…తళి ప్రాంత ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభాకర రెడ్డి డిమాండ్ చేశారు. తమ నాయకుడు బాలకృష్ణారెడ్డి హోసూరు ప్రాంతానికి రోజా పూల ఎగుమతి కేంద్రం, శీతల గిడ్డంగి, గోపసంద్రం వద్ద రెండు భారీ వంతెనలు, హోసూరులో మార్కెట్ యార్డ్, హోసూరు కార్పొరేషన్ భవన నిర్మాణం…తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ తన హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వై. ప్రకాష్ చౌకబారు విమర్శలు చేయడం మానుకొని, పెద్దరికాన్ని నిలుపుకోవాలని పలువురు ఎడిఎంకె నాయకులు హితవు పలికారు. ఇకపై మాజీమంత్రి బాలకృష్ణారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని వారు హెచ్చరించారు.