28 మంది ఉపాధ్యాయులపై చర్యలు

28 మంది ఉపాధ్యాయులపై చర్యలు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరు ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో పని చేస్తున్న 28 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరైనా బయోమెట్రిక్ మెట్రిక్ పద్ధతిని అనుసరించనందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాలలో సుమారు అయిదు వందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 28 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టి ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయిస్తోంది. కృష్ణగిరి జిల్లాలోని అత్యధిక పాఠశాలల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తున్నారు. బాగలూరు పాఠశాలలో కూడా బయోమెట్రిక్ పద్దతిని ఉపాధ్యాయులు పాటించేవారు. అయినప్పటికీ పాఠశాలకు ఉపాధ్యాయులు సమయానికి హాజరు కావడం లేదని స్థానికులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గురువారం 28 మంది ఉపాధ్యాయులు హాజరైనా, బయోమెట్రిక్ పద్ధతిని పాటించనందున అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై ఉపాధ్యాయులను అడిగినప్పుడు, గురువారం బాగలూరు ప్రాంతంలో కరెంటు కోత వల్ల బయోమెట్రిక్ యంత్రం పని చేయలేదని తెలిపారు. యంత్రం పనిచేయక పోవడంతో అధికారులకు వాట్సాప్ ద్వారా సమాచారమందించామని చెప్పారు. పాఠశాలలో అప్పుడప్పుడు వైర్లు కాలిపోయి విద్యుత్‌ సరఫరా ఉండడం లేదని వాపోయారు. బయోమెట్రిక్ యంత్రం పనిచేయక పోవడం తమ తప్పిదం కాకపోయినా అధికారులు తమపై చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేయడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos