తిరువనంతపురం:రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు.అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వందనం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గురువాయుర్ నుంచి కాయంకులంకు కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని అలప్పుజ జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మహమ్మద్, ముహాసిన్, ఇబ్రహీం, దేవానంద్, శ్రీదీప్‌లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.