స్వర్గానికి ప్రతిరూపం ఉబ్బలమడుగు జలపాతం..

  • In Tourism
  • November 9, 2019
  • 374 Views
స్వర్గానికి ప్రతిరూపం ఉబ్బలమడుగు జలపాతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ రాయలసీమ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతాలకు,అందమైన జలపాతాలకు చిత్తూరు జిల్లా నిలయమనే చెప్పుకోవాలి.ఎన్నో జలపాతాలు,అరుదైన చెట్లు,వన్యప్రాణాలు,పక్షులకు ఆలవాలంగా నిలుస్తున్న శేషాచలం,తలకోన,భైరవకోన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దట్టమైన అడవులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.వాటిలో ఉబ్బలమడుగు జలపాతం కచ్చితంగా చూసీ తీరాల్సిన జలపాతాల జాబితాలో ముందువసరులో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకొన అని పిలువబడే దట్టమైన అటవీప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం ఉంది.

ఉబ్బలమడుగు జలపాతం


ఉబ్బలమడుగులో జలపాతం


ఈ జలపాతాన్ని తడ జలపాతం అని కూడా పిలుస్తారు.భయంకరమైన దట్టమైన సిద్దులకోన అటవీప్రాంతంలో ఉండే ఉబ్బలమడుగు చేరుకోవాలంటే దాదాపు పది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.అడవి అంతా అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి అలసట కనపడకుండా చేస్తాయి. ఎంత దూరం ప్రయాణించామో కూడా తెలీదు. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నప్పటికీ చిన్న చిన్న కొలనులు అక్కడక్కడ దర్శనం ఇస్తుంటాయి. కొలనులో దిగి కేరింతలు, ఈతలు కొట్టవచ్చు.

ఉబ్బలమడుగులో కొలను


ఉబ్బలమడుగులో కొలను


సెలయేరుపై నిర్మించిన వంతెన ఇక్కడి ప్రధాన ఆకర్షణ.పక్షుల కిలకిలరాగాలు, చిన్నపాటి సెలయేర్లు, ప్రశాంత ప్రకృతిని దాటుకుంటూ అలానే ముందుకు వెళితే గలగల శబ్దాలు చేస్తూ పై నుంచి కిందకు వయ్యారంగా జాలువారే సుందర జలపాతం దర్శనం ఇస్తుంది.జలపాతం అందాన్ని చూస్తే మనల్ని మనం మరిచిపోవాల్సిందే! చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ జలపాతం కింద తనివితీరా జలకాలు ఆడవచ్చు.

సెలయేరుపై వంతెన


సెలయేరు


పది కిలోమీటర్ల పరిధి వరకు దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చే సమయంలోనే పర్యాటకులు ఆహారం,తాగునీరు ఇతర వస్తువులు తమ వెంట తీసుకెళ్లడం ఉత్తమం.ఉబ్బలమడుగు ప్రకృతి అందాలకు,ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. సాధారణ రోజులలో ఉబ్బలమడుగు ప్రాంతంలో ఉండటం ప్రమాదకరం. కనుక చీకటి పడగానే వరదయ్యపాలెంకు తిరుగు ప్రయాణం కావడం ఉత్తమం..

రాళ్ల మధ్యలో సెలయేరు


సిద్దేశ్వర ఆలయం :
ఉబ్బలమడుగు జలపాతం పక్కనే ఉన్న సిద్దేశ్వర ఆలయానికి పురాతన చరిత్ర ఉందని తెలుస్తోంది.సుమారు వందేళ్ల క్రితం ఇక్కడ సిద్దేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఉబ్బలమడుగు జలపాతం పక్కనే సిద్దేశ్వర ఆలయం కలదు. ఈ ఆలయం పురాతనమైనది మరియు వందేళ్ల చరిత్ర కలది. ఈ ఆలయంలో శివలింగం స్వయంభూ శివలింగమని అందుకే పూజలు చేస్తే శుభం చేకూరుతుందని పురాణాల్లో సైతం పేర్కొనడంతో ఇక్కడికి వచ్చే భక్తులు సిద్దేశ్వర ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు.మహాశివరాత్రి రోజున ఉబ్బలమడుగు ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకొనే స్థానికులు ఇక్కడే టెంట్లు వేసుకొని వంటావార్పు కానిచ్చేస్తారు. ఆ సమయంలో దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తాయి.

సిద్దేశ్వర ఆలయం


ఎలా చేరుకోవాలి..
తిరుపతి లేదా శ్రీకాళహస్తికి బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో వరదయ్యపాలెం చేరుకోవాలి.అక్కడి నుంచి ఆటోలో ఉబ్బలమడుగు ప్రవేశ ద్వారం చేరుకొని అక్కడి కాలిక నడకన ఉబ్బలమడుగుకు చేరుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos