వీరికి గబ్బిలాలు ‘దేవతలు’

వీరికి గబ్బిలాలు ‘దేవతలు’

గబ్బిలాలను పూజిస్తే రోగాలు పోతాయా?
ఇటీవల కేరళలో నిఫా వైరస్ కలకలం సృషించిన విషయం తెలిసిందే. ఆ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం జరిగింది. దాంతో కొంతమంది గబ్బిలాలు అంటేనే భయపడుతున్నారు.
తమ పరిసరాల్లో గబ్బిలాలు లేకుండా చూసుకుంటున్నారు. వాటికి దూరంగా ఉంటున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామస్తులు మాత్రం వాటిని పూజిస్తున్నారు. వాటి మధ్యనే జీవిస్తున్నారు.
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు గ్రామంలో చెట్లపై వందల సంఖ్యలో గబ్బిలాలు కనిపిస్తాయి.గబ్బిలాలకు, అవి వాలిన చెట్లకు ఈ గ్రామస్తులు పూజలు చేస్తారు.
స్థానికులే కాదు, సమీప ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు.ఈ గ్రామంలో పిల్లలకు గబ్బిలాల మలం పూస్తారు. గబ్బిలాలను పూజిస్తారు.
‘పిల్లలకు గబ్బిలాల విసర్జితం పూస్తారు”పక్షి దోషం’తో పుట్టినవారిని, అనారోగ్యంతో ఉన్న పిల్లలను గబ్బిలాల చెట్టుదగ్గరకు తీసుకొచ్చి పూజలు చేస్తుంటారని గ్రామస్తురాలు సంగెమ్మ తెలిపారు.
పిల్లల శరీరానికి చెట్టుకింద పడిన గబ్బిలాల విసర్జితాన్ని పూసి, ఆ చెట్టుకిందే స్నానం చేయిస్తారని, గబ్బిలాల ఎముకలను పిల్లలకు తాయత్తుగా కడతారని వివరించారు.అలా చేస్తే రోగాలు నయమవుతాయని, పక్షి దోషం పోతుందని చెబుతున్నారామె.
మాధవరంపోడు వాసులు గబ్బిలాలను ఆరాధించటం, పూజించటం వెనుక ఓ కారణముంది.
‘‘అనేక సంవత్సరాల క్రితం ఈ ఊరు నిత్యం ముఠాకక్షలతో రగిలిపోతూ అభివృద్ధికి దూరంగా ఉండేది. అలాంటి సమయంలో ఓ రోజు ఊరి చివరనున్న మర్రిచెట్టుపైకి వందలాది గబ్బిలాలు వచ్చి వాలాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఊరిలోని కొన్ని చెట్లపైకి చేరుకున్నాయి. అప్పటినుంచి గ్రామంలో ముఠాకక్షలు తగ్గి, అభివృద్ధి జరగింది.’’ అని స్థానికులు చెబుతున్నారు.గబ్బిలాలు వచ్చాకే ఊరు బాగుపడిందని, తమ కష్టాలు తీర్చేందుకు భగవంతుడే వాటిని పంపాడని గ్రామస్థులందరూ నమ్ముతున్నట్లు గ్రామ సర్పంచి రామరాజు తెలిపారు.తమ ఊరికి గబ్బిలాలు వచ్చాకే పంటలు బాగా పండుతున్నాయని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని, పూరి గుడిసెల్లో ఉన్నవారంతా పక్కా ఇళ్లు కట్టుకున్నారని ఆయన తెలిపారు.తమకష్టాలు తీర్చినందుకే తాము వాటిని ఆరాధిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
‘మాకేం భయం లేదు’
గబ్బిలాలు అధికంగా సంచరించే మాధవరంపోడు సమీప గ్రామాల్లో వందల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి.రైల్వే కోడూరు మండలం మామిడికి ప్రసిద్ధి. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు మామిడి కాయలు, పండ్లను సరఫరా చేస్తుంటారు.గబ్బిలాలు కొరికిన పండ్లను తింటే నిఫా వైరస్ సోకుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మామిడి వ్యాపారులను, తోటల్లో పనిచేసే వారిని బీబీసీ పలకరించింది.తాను మామిడితోటకు కాపలాదారునని, గబ్బిలాలు కొరికిన పండ్లను తింటుంటానని, ఇంతవరకూ తనకు ఎటువంటి సమస్యా రాలేదని చౌడవరం సిద్దయ్య అన్నారు.
మామిడి కాయల వ్యాపారి సాదు చంద్రబాలు మాట్లాడుతూ.. రైల్వేకోడూరు సమీప గ్రామాల్లో గబ్బిలాలు అధికంగా ఉన్నప్పటికీ వాటివల్ల ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. గబ్బిలాల వల్ల హాని జరుగుతుందన్నది సరికాదన్నారు.
‘అది వారి నమ్మకం మాత్రమే’
గబ్బిలాల అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (ఇన్‌ఛార్జ్) డాక్టర్ రామిరెడ్డిని సంప్రదించగా మాధవరంపోడు ప్రాంతంలో గబ్బిలాలను, చెట్లను పూజిస్తుంటారని.. అలా చేయటంవల్ల జబ్బులు నయమవుతాయన్నది వారినమ్మకమని చెప్పారు.గబ్బిలాలను , చెట్లను పూజించటం వల్ల రోగాలు తగ్గవని, అది కేవలం వారి నమ్మకం మాత్రమేనని అన్నారు.జిల్లాలో గబ్బిలాల వల్ల ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అలాంటప్పుడు ప్రజల నమ్మకాలను అడ్డుకోవటం సరికాదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos